ప్రజాశక్తి-బాపట్ల: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపును జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం, సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో శనివారం ప్రజాసంఘాల కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశంలో బడా కార్పొరేట్లకు అండగా ఉంటుందన్నారు. అదాని, అంబానీలకు దేశ సంపదను దోచిపెట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులకు కనీసం మద్దతు ధర పెంపు, విద్యుత్తు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేస్తామని ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్మిక చట్టాలను పూర్తిగా మార్పు చేస్తామన్న ప్రకటన అమలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 ఢిల్లీలో జరిగే మహా ధర్నా కు పెద్ద ఎత్తున రైతులు కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈనెల 21 నుండి అన్ని గ్రామాల్లో విస్తతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ సామూహిక సమావేశాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ వినోద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి కృష్ణమోహన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ పాల్గొన్నారు.










