ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ కళావేదికలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల సభ్యులకు రూ.69.50 కోట్ల నమూనా చెక్కును నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో వాయిదా చెల్లించిన అన్ని సంఘాలకు సున్నా వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. సంఘం అప్పు నిల్వలో రూ.మూడు లక్షల వరకు సున్నా వడ్డీ వర్తిస్తుందన్నారు. క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా అప్పు పొందిన సంఘాలు ప్రతి నెలా, గత నెలాఖరు నాటికి ఉన్న అప్పు నిల్వల్లో కనీసం మూడు శాతం ప్రస్తుత నెలలో చెల్లించి ఉండాలన్నారు. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా స్వయం సహాయక సంఘం అప్పు ఖాతాకు జమ చేస్తుందని తెలిపారు. ఒకవేళ ఇప్పటికే అప్పు పూర్తిగా చెల్లించి ఖాతా క్లోజ్ అయితే సంఘం పొదుపు ఖాతాకు జమ చేయడమవుతుందని వివరించారు. జిల్లాలో 45,954 సంఘాల్లో ఉన్న 5,91,923 మంది సభ్యుల ఖాతాల్లో రూ.69.50 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డిసిఎంఎస్ చెర్మన్ గొండు కృష్ణమూర్తి, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ హైమావతి, మెప్మా పీడీ కిరణ్, ఎల్‌డిఎం సూర్యకిరణ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










