ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. భట్టిప్రోలులో రేషన్ బియ్యం తరలిస్తున్న సమచారం మేరకు.. స్థానిక హెచ్‌పి పెట్రోలు బంక్ వద్ద నిఘా వేసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపి 39 యుహెచ్ 4383 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీలో తెల్ల గోతాలలో తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యం స్వాధీన పర్చుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా దాడులు చేసినట్లు తెలిపారు. డ్రైవర్ తిరుమాళ్ల లోక మణికంఠ ప్రసాద్‌ను ప్రశ్నించగా గ్రామానికి చెందిన దీపాల శ్రీనివాసరావు కార్డుదారుల నుంచి రాయితీ పంపిణీ బియ్యం కేజీ 13 రూపాయలకు కోనుగోలు చేసి కోళ్లఫారాలకు 17 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడన్నారు. దీంతో డ్రైవర్ మరియు ఓనర్ శ్రీనివాసరావుపై నిత్యావసరాల చట్టం 6ఏ ప్రకారం కేసులు నమోదు చేసి బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు మాధవరెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీహరిరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షేక్ సైదులు, స్థానిక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రవీంద్రబాబు తదితరులు ఉన్నారు.










