Nov 01,2023 21:16

స్వీట్లు పంపిణీ చేస్తున్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు

ప్రజాశక్తి-విజయనగరం కోట : చంద్రబాబును అరెస్టు చేసి 52రోజులు జైల్లో ఉంచినా నేరాన్ని రుజువు చేయలేకపోయారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం ఉత్సవాల ముగింపు రోజున చంద్రబాబు విడుదల కావడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని శాసనసభకు వెళ్లకుండా చూశారని అన్నారు. చంద్రబాబు విడుదల కోసం శాంతియువత నిరసనలు తెలిపి, ఆలయాల్లో పూజలు చేసిన అభిమానులకు, కార్యకర్తలకు,ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఏ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగినా రైల్వే మంత్రి వెళ్తారని, కానీ మన జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని పరిశీలించేందుకు రాకపోవడానికి కారణాలు ఏమిటని అశోక్‌ ప్రశ్నించారు. ప్రమాద ఘటనను పరిశీలించకపోవడం, బాధితులను పరామర్శించక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏమైనా మేనేజ్‌ చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. సమావేశంలో టిడిపి నాయకులు ఐవిపి రాజు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, రాజేష్‌బాబు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం
చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడంతోప్రజల ఆకాంక్ష నెరవేరిందని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. బుధవారం స్థానిక కోట వద్ద చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్‌పై బయటకు రావడంతో ఆమె ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజం గెలవాలని నారా భువనేశ్వరి చేపట్టిన యాత్ర ఫలించిందని అన్నారు ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు నిర్బంధాలు పెట్టినా నిజం ఎప్పటికైనా గెలుస్తుందని తెలుసుకోవాలని అన్నారు. నారా లోకేష్‌ యువగాలంతో చేపట్టిన పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకపోయిందని అన్నారు. రేపటి భవిష్యత్తు కావాలంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలు గ్రహించారన్నారు. కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.