* జగనన్న విద్యా దీవెన నిధులు జమ
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: జగనన్న విద్యా దీవెన కింద 51,337 మంది విద్యార్థులకు రూ.33.07 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. 2022-23 ఏడాదికి గానూ మూడో విడత జగనన్న విద్యా దీవెన ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే 51,337 మంది విద్యార్థులకు నగదు జమ చేసినట్లు తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ దగ్గర నుంచి విదేశీ విద్య వరకు పలు పథకాల కింద నిధులు అందజేస్తోందన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విశ్వమోహన్‌రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనురాధ, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










