Nov 10,2022 00:04

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌
ప్రజాశక్తి - రంపచోడవరం

జిల్లాలో ఈ సంవత్సరం 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ గణేష్‌ కుమార్‌తో కలిసి స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో 11 మండలాలకు సంబంధించిన జిసిసి మేనేజర్లు, డిఎంలు, గొడౌన్‌ ఇన్‌ఛార్జులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల టెక్నికల్‌ అసిస్టెంట్లతో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని జీకే వీధి మండలం మండలంలో 4 కొనుగోలు కేంద్రాలు, కొయ్యూరులో 3, చింతపల్లిలో 3, పాడేరులో 3, కూనవరంలో 4, దేవీపట్నంలో 4, గంగవరంలో 3, ఎటపాకలో 5, విఆర్‌.పురంలో 3, అడ్డతీగలలో 3, చింతూరులో 4, వై.రామవరంలో 4, రాజవొమ్మంగిలో 6, మారేడుమిల్లిలో ఒకటి, రంపచోడవరంలో 6, మొత్తం 56 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో పదివేల గోనెసంచులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్నింటికీ జిసిసి ద్వారా గోనె సంచులు సరఫరా చేయాలన్నారు. ఈ ధాన్యాన్ని సంబంధించిన రైతులకు డబ్బులు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో మిల్లర్లతోనూ, ధాన్యం తరలించే లారీ ఓనర్లతోనూ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని సూచించారు. రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ మాట్లాడుతూ డివిజన్‌లోని ఏడు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి కేంద్రానికి రూట్‌ అధికారులుగా వాలంటరీలను ఉపయోగిస్తామని, ధాన్యానికి సంబంధించిన రైతు, వాలంటరీ ఇరువురు కలిసి ఫొటోలు తీసి అప్లోడ్‌ చేయాలని సూచించారు. టెస్టులు చేసి క్వాలిటీ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ గణేష్‌ కుమార్‌, జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ పార్వతీశం, డివిజనల్‌ సివిల్‌ సప్లై అధికారి సి.శ్రీహరి, జిసిసి సీనియర్‌ మేనేజర్లు ఎంఎన్‌.రాజారెడ్డి, జి.చంద్రశేఖర్‌, విజయలక్ష్మి, భాస్కరరావు పాల్గొన్నారు.