ప్రజాశక్తి-మెంటాడ : ఇంటింటికీ వైద్య సేవలను అందించేందుకు ఉద్దేశించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. పిట్టాడ గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి 502 మంది రోగులు హాజరయ్యారు. వైద్య పరీక్షలను చేయించుకొని, మందులు తీసుకున్నారు. పిట్టాడ వానిజ, కారుమామిడివలస, రాయవలస, మిర్తివలస తదితర గ్రామాల్లో ఇంటింటి సర్వేతోపాటు విస్తత ప్రచారం చేసి, రోగులు శిబిరానికి హాజరయ్యేందుకు వీలుగా వాహన సదుపాయం కూడా కల్పించారు. వైద్య శిబిరం వద్ద స్థానిక పిహెచ్‌సి డాక్టర్ ఎం.శృతితో, చల్లపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజనా రాణితో పాటు మరో ఆరుగురు స్పెషలిస్టు వైద్యులను అందుబాటులో ఉంచారు. ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శోభాదేవి, సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ సునీల్‌కుమార్, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సౌమిత్, ఇఎన్‌టి నిపుణులు డాక్టర్ రామకృష్ణరాజు, ఎస్‌పిఎం డాక్టర్ టి.కావ్యశ్రీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నపిల్లలకు డిసిహెచ్‌ఎస్ డాక్టర్ గౌరీ శంకర్ వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో 14 రకాల పరీక్షలను నిర్వహించారు. దాదాపు 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. వైద్యులు, రోగులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మెరుగైన పారిశుధ్యం కోసం ఉత్తమ సేవలందిస్తున్న 13 మంది క్లాప్ మిత్రాలను కలెక్టర్ నాగలక్ష్మి సన్మానించారు.
కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్, డిపిఒ నిర్మలాదేవి, బొబ్బిలి ఆర్‌డిఒ శేషశైలజ, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ భాస్కరరావు, 108 జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అప్పలరాజు, ఎంపిపి రెడ్డి సన్యాశినాయుడు, తాశిల్దార్ రామకష్ణ, ఎంపిడిఒ త్రివిక్రమరావు, సిడిపిఒ నాగమణి, సర్పంచ్ కె.నాయుడుబాబు, రెడ్డి రాజప్పలనాయుడు పాల్గొన్నారు.
ఉత్తీర్ణతకోసం విద్యార్ధులను దత్తత తీసుకోవాలి
పదో తరగతి విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ ఐదుగురిని దత్తత తీసుకొని, వారిని బాగా చదివించి టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులు చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. జిటి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వయంగా రుచిని పరీక్షించారు. విద్యార్ధులతో మాట్లాడి, ఉపాధ్యాయుల బోధనా పద్దతిపై ఆరా తీశారు. రక్తహీనత ఉన్న విద్యార్ధుల గురించి ఆరా తీశారు. ఐరన్ మాత్రలను తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదోతరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు తగిన కార్యాచరణను అమలు చేయాలన్నారు. ఐదుగురు విద్యార్ధుల బాధ్యతను ఒక ఉపాధ్యాయుడికి అప్పగించి, వారిని చదివించి, ఉత్తీర్ణులు చేసే బాధ్యత అప్పగించాలని ఎంఇఓలు, హెచ్‌ఎంకు కలెక్టర్ సూచించారు.










