చేబ్రోలు: అక్రమంగా రవాణా చేయుచున్న 500 బస్తాల రేషన్ బియ్యం (పిడిఎస్) స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ప్రాంతీయ నిఘా అమలు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ..పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యాన్ని సేకరించి, నకిలీ బిల్లులతో ఇతర రాష్ట్రములకు అక్రమంగా రవాణా చేయుచున్నారని గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.పి. కె. ఈశ్వర రావు కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నాడు గుంటూరు విజిలెన్స్ అధికారులు, చేబ్రోలు మండలం నారాకోడూరు సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. తెనాలి వైపు నుండి గుంటూరు వైపుకు లోడ్ తో వస్తున్న లారీ జిజడ్10టివి 8711 ని ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న సరుకు కి సంబంధించి బిల్లులను పరిశీలించగా, నడింపలికి చెందిన లలితా ట్రేడర్ యజమాని కారుమూరు సత్యనారాయణకు చెందినవిగా గుర్తించారు. ప్లాస్టిక్ బస్తాలలో పిడిఎస్ బియ్యం చెరుకుపల్లి మండలం నుండి గుజరాత్ రాష్ట్రమునకు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత విజిలెన్సు అధికారులు చెరుకుపల్లి లో తనిఖీ నిర్వహించగా, ఎటువంటి లైసెన్స్ గానీ, వ్యాపార లావాదేవీలకు సంబందించిన రశీదులు కానీ, రికార్డు లు కానీ లేవు. కారుమూరు సత్యనారాయణ చెరుకుపల్లి, దాని చుట్టు పక్కల గ్రామాల నుండి సబ్సిడీ బియ్యం సేకరించి, నకిలీ బిల్లులతో అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. లారీ లోని 500 ప్లాస్టిక్ బస్తాలలో ఉన్న 250 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనపరచుకుని, కారుమూరు సత్యనారాయణ పై 1955 నిత్యావసరాల చట్టం ప్రకారం 6(ఎ), క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా స్థానిక సి.ఎస్.డి.టి. ని విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. తేని ఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎ. శ్రీహరి రావు, తహశీల్దార్ కె. నాగమల్లేశ్వరరావు, స్థానిక రెవెన్యూ అధికారి,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










