Jul 06,2023 01:03

ప్రజాశక్తి-గుంటూరు : కౌలు రైతులందరికీ సీసీఆర్‌సి కార్డులు మంజూరు అయ్యేలా వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టరేట్‌ నుండి జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి జగనన్నకు చెబుదాం, వ్యవసాయశాఖ, గ్రామ వార్డు సచివాలయాల సేవలు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పురోగతి, రెవెన్యూ అంశాలపై సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో, ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీ ల్దారు, ఎంపీడీవో, పంచాయితీరాజ్‌ ఇంజినీ రింగ్‌, మండల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో అవసరం మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయశాఖ సహయకులు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ పంటల సాగుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. లక్ష్యం మేరకు 50 వేల సీసీఆర్సీ కార్డులు కచ్చితంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు. సీసీఆర్‌సి కార్డుదారులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరును మండల స్థాయి వ్యవసాయ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించి నివేదిక అందించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల్లో రూఫ్‌ లెవల్‌, అపైన పూర్తి అయిన భవనాలను సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, ఫినిషింగ్‌లో ఉన్న భవనాల పెండింగ్‌ పనులు జూలై చివరి నాటికి పూర్తి చేసి సంబంధిత శాఖలకు అందించాలని చెప్పారు. లక్ష్యాల మేరకు భవన నిర్మాణాల పురోగతి లేని మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మాణ ఏజెన్సీలతో నిరంతరం పర్యవేక్షించి పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. వాలంటీర్ల సర్వేలో వచ్చిన దరఖాస్తులకు ఎప్పటికప్పుడు టోకేన్‌ నెంబర్లు కేటాయించి ఆన్లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ధ్రువ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, పంచాయ తీరాజ్‌ ఎస్‌.ఈ.బ్రహ్మయ్య, సీపీఓ శేషశ్రీ పాల్గొన్నారు.