Feb 24,2023 23:49

వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి-చింతూరు
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు 50 రోజుల్లో కల్పిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిని సందర్శించి అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులు, చిన్నపిల్లలు, కళాశాల విద్యార్థులకు రక్తహీనత రాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తహీనత నిర్మూలనకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ, అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారుల సహకారంతో విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చింతూరు ఆసుపత్రిలో బ్లడ్‌ డొనేషన్‌ కేంద్రాన్ని బ్లడ్‌ బ్యాంకుగా మార్చటానికి త్వరలో ప్రతిపాదనలు పంపుతామన్నారు.
గర్భిణుల వైద్యానికి అవసరమైన పరికరాలు సమకూరుస్తామని, ఎముకల డాక్టర్లకు అవసరమైన ఎక్స్‌రే ప్లాంట్‌ రిపేరు చేస్తామని తెలిపారు. ఫ్రాక్చర్‌ టేబుల్‌ సిఆర్‌ఎమ్‌ సిస్టం కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇఎన్‌టి వైద్యులకు కావలసిన పోర్టబుల్‌ ఎండోస్కోపీని వెంటనే కొనుగోలు చేయాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పుల్లయ్యను ఆదేశించారు. అత్యాధునిక మూడు బెడ్లను ఎస్‌ఎంసిలో కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ మరమ్మతులు చేపట్టాలన్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వెయిటింగ్‌ హాల్‌, తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో లాగా రోగులను భద్రాచలం రిఫర్‌ చేసే అవకాశం లేకుండా ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పుల్లయ్య, గైనిక్‌ డాక్టర్‌ శశికళ, ప్రత్యేక వైద్యులు పాల్గొన్నారు.