Oct 11,2023 23:32

పాదయాత్రలో నాయకులు

ప్రజాశక్తి - మంగళగిరి : కొండ పోరంబాకు స్థలంలో 50 ఏళ్లుగా ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి డి ఫారెస్ట్‌ చేసి ఇళ్ల పట్టాలివ్వాలని పేదలు కోరారు. ఈ మేరకు సిపిఎం పాదయాత్ర బృందానికి అర్జీలిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర బుధవారం మంగళగిరి పట్టణంలోని 1వ వార్డు నుండి 7వ వార్డు వరకు సిపిఎం కొనసాగింది. ప్రజలు తామెదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులకు వివరించి వినతి పత్రాలు ఇచ్చారు. తమకు అటవీశాఖాధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారని, రిజిస్ట్రేషన్లను కూడా నిలిపేశారని, బ్యాంకు రుణాలూ ఇవ్వడం లేదని కొండపోరంబోకు భూమి నివాసితులు వాపోయారు. కార్పొరేషన్‌ విధించిన చెత్తపన్ను తమకు ఆర్థికంగా భారంగా ఉందని, దీన్ని రద్దు చేయాలని అన్నారు. అనేక కారణాలతో పెన్షన్లను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని, దేవస్థానం భూమిలో ఏన్నో ఏళ్లుగా ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలని, 4వ వార్డు ఎస్టీ కాలనీలో పేదలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు వినతిపత్రాలను పాదయాత్ర బృందానికి అందించారు.
ఈ సందర్భంగా పాతబస్టాండ్‌ సెంటర్లో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్న వైసిపి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. ఇసుక ధరలను పెంచి భవన నిర్మాణ రంగ కార్మికులకు పనులు లేకుండా చేశారని మండిపడ్డారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత ప్రజలపై భారాలు మోపారేగాని అభివృద్ధి మాత్రం లేదన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలపై 16వ తేదీన కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చేసే మహాధర్నాకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలోని పలుచోట్ల ఇళ్లేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు.
పాదయాత్రకు వివిధ ప్రాంతాల్లో ఘన స్వాగతం లభించింది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, పొట్టి శ్రీరాములు, నిమ్మగడ్డ రామ్మోహనరావు, తుపాకుల సుబ్బారావు, విగ్రహాలకు నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. సిపిఎం జెండాలను జిల్లా కార్యదర్శితోపాటు తాడేపల్లి రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డి, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, ఎస్‌.గణేష్‌ ఆవిష్కరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలు, ప్రజా సమస్యలపై పాటలను ఆలపించారు. పాదయాత్ర బృందం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడ అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలు, ఓపీ తదితర వివరాలను తెలుసుకుంది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు పి.బాలకృష్ణ, ఎం.బాలాజీ, టి.శ్రీరాములు, వివి జవహర్లాల్‌, కె.నాగేశ్వరరావు, డి.రామారావు, ఎస్‌.వెంకటేష్‌, ఎం.నాగేశ్వరరావు, కె.ఏడుకొండలు, కె.శ్రీనివాసరావు, టి.హేమసుందర్‌రావు, ఎస్‌.నరసింహారావు, ఎస్‌.గణేష్‌, ఎం.రాంబాబు, జె.నవీన్‌ ప్రకాష్‌, వి.వెంకటేశ్వరరావు, మేరమ్మ పాల్గొన్నారు.