ప్రజాశక్తి-ఎటపాక
భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఆయా పంచాయతీ ప్రజలు తెలంగాణ గవర్నర్ తమిళసైకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పలు కార్యక్రమాల నిమిత్తం భద్రాచలం వచ్చిన తెలంగాణ గవర్నర్ కన్నయిగూడెం, పిచ్చుకలపాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం పంచాయతీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 5 పంచాయతీల ప్రజలతో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా గవర్నర్‌కు తమ సమస్యలను వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం మండలంలో ఉన్న ఐదు పంచాయతీలను పోలవరం ముంపు ప్రాంతమని ఆంధ్రాలో కలిపారని తెలిపారు. కాని ఐదు పంచాయతీలు పోలవరం ముంపులో లేవని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పిందని, అందువల్ల తమకు పోలవరం పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 400 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం, 80 కిలోమీటర్ల దూరంలో ఐటీడీఏ కేంద్రం ఉన్నాయని తెలిపారు. అదే తెలంగాణలో కలిపితే 45కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం, 10 కిలోమీటర్ల దూరంలో అన్ని వైద్య సౌకర్యాలు, పీజీ వరకు విద్య అందుబాటులో ఉంటాయని వివరించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నందున రవాణాకు కూడా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన తెలంగాణ గవర్నర్ మాట్లాడుతూ 5 పంచాయతీల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగిలి సంపత్, నక్కా వెంకన్న, బేతి పాపారావు, బండారు వీర భద్రం, గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.










