Jan 03,2023 23:14

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: మహిళలను మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే కోవే (కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌పెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా) ఎపి ఛాప్టర్‌, సిడ్బీ (స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి విజయవాడలో 'సిడ్బీ స్వావలంభన్‌ మేళా నిర్వహించనున్నట్లు కోవే ఎపి ఛాప్టర్‌ ప్రెసిడెంట్‌ రాధిక, నేషనల్‌ జాయింట్‌ సెక్రటరీ అపర్ణ తెలిపారు. నగరంలోని కోవే ఛాప్టర్‌ కార్యాలయంలో మేళాకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ మూడు రోజుల పాటు బెంజిసర్కిల్‌ వద్ద గల వేదిక కళ్యాణ మండపంలో ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. హస్త కళాకారులు, చేనేత ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తులు, చిరు ధాన్యాలు, వివిధ రకాలైన వంటకాలు, గ్రామీణ, గిరిజన ఉత్పత్తులు ఈప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. 5న ప్రారంభ సభ అనంతరం మహిళల కోసం 'బిజినెస్‌ ఐడియా కాంటెస్ట్‌', 6న వంటల పోటీలు, తంబోలా, డ్యాన్స్‌ పోటీలను, 7వ తేదీ ఉదయం ఫ్యాన్సీ డ్రస్‌ షో చిన్నారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవే ఎపి ఛాప్టర్‌ సెక్రటరీ విజయలక్ష్మి, సెక్రటరీ-2 మోహిని, ట్రెజరర్‌ శ్రావణి, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు సత్యవతి పాల్గొన్నారు.