Nov 01,2023 21:10

బనగానపల్లె మండలంలో వర్షాలు లేక ఎండిపోయిన ఎండిపోయిన కంది పంట

5 మండలాల్లోనే కరువంటా..!
- తీవ్ర వర్షాభావం ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం
- రైతులకు ప్రయోజనాలు అందకుండా పోయే అవకాశం
- నంద్యాల జిల్లా పశ్చిమప్రాంతం నుంచి వలసలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

    నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లోనే కరువు ఉన్నట్లు అధికారులు కరువు మండలాలను ప్రకటించారు. 11 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉన్నా పట్టించుకోలేదు. దీంతో రైతులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది...
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఆ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలో 5 మండలాలను కరువు మండలాలుగా, మరో మండలాన్ని మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు. బనగానపల్లె, మిడుతూరు, పగిడ్యాల, గడివేముల, బేతంచర్ల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. పాణ్యం మండలాన్ని మధ్యస్థ కరువు మండలంగా ప్రకటించారు. మిగిలిన మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని విస్మరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కాగా అక్టోబర్‌ నెలలో చినుకు జాడ లేదు. వంద శాతం లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 152.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 40.08 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని 29 మండలాల్లో 26 మండలాల్లో 50 శాతం కన్నా లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాములపాడు మండలంలో 93 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 12 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. వర్షాభావం ప్రభావం నంద్యాల జిల్లాలో ప్రధాన పంటగా ఉండే వరి సాధారణ సాగు 1,76,315 ఎకరాలు కాగా కేవలం 45,062.5 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ సాగు 1,04,745 ఎకరాలు కాగా 86,125 ఎకరాల్లో విత్తనాలు విత్తారు. కంది సాధారణ సాగు 93,877.5 ఎకరాలు కాగా 73,680 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు 39,510 ఎకరాలు కాగా 21,050 ఎకరాల్లో సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 63,965 ఎకరాలు కాగా ఇప్పటి వరకూ 23,287.5 ఎకరాల్లో సాగైంది. ఉల్లి సాధారణ సాగు 10,182.5 ఎకరాలు కాగా 4,997.5 ఎకరాల్లో సాగు చేశారు. మిరప సాధారణ సాగు విస్తీర్ణం 25,010 ఎకరాలు కాగా 13,050 ఎకరాల్లో సాగైంది. గతేడాది మిర్చి పంట తెగుళ్లతో భారీగా నష్టాలు మూటగట్టుకోవడంతో రైతులు ఈ ఏడాది మిరప సాగు చేసేందుకు ఆసక్తి చూప లేదు. విత్తనాలు వేసిన సమయంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ మునుముందు వర్షాలు కురుస్తాయని రైతులు ఆశపడి విత్తనాలు వేశారు. విత్తనాలు మొలచిన కొన్ని రోజుల వరకు రైతులకు వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో మొలకెత్తిన మొక్కజొన్న పత్తి మునగ పంటలు నీటిలో మునిగి పూర్తిగా చనిపోయింది. ఆ పరిస్థితుల్లో కొందరు రైతులు పంటలను పూర్తిగా చెడగొట్టారు. మొక్కజొన్న వేసిన రైతులకు ఒక ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు వస్తుంది. పత్తి పంటకు ఎకరాకు సుమారు రూ.15 వేల నుంచి రూ.20వేల దాకా ఖర్చవుతుంది. అదే కౌలు రైతులకు అదనంగా ఈ ఖర్చుతోపాటు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా కూడా గుత్త చెల్లించవలసి ఉంటుంది. ఇంత ఖర్చు చేసిన రైతన్నలపై ప్రకృతి కన్నెర్ర చేసి వర్షాకాలం అయిపోతున్నా రైతులకు సరైన వర్షాలు పడకపోవడంతో ఎండాకాలం లాగా ఎండలు మండుతుండడంతో అరకొరగా ఉన్న పంటలు కూడా ఎండిపోయాయి. రైతులు చేసిన అప్పులు కూడా తీర్చలేక ఆత్మహత్యల శరణ్యం అనుకున్న రైతులకు కరువు మండలంగా ప్రకటించి నష్టపరిహారం అందిచాల్సిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టకుండా పరిమిత సంఖ్యలో కరువు మండలాలను ప్రకటించింది. దీంతో రైతులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది.