ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని బూదరాళ్ళ పంచాయతీ పరిధి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కొర్రా లక్ష్మి ఆకస్మికంగా మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల మేరకు డోలీమోతతో గ్రామానికి తరలించిన వైనం గురువారం చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి మూడు వారాల క్రితం మండలంలోని కొమ్మిక గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో నీరసంగా ఉందని చెప్పడంతో అక్కడి బంధువులు వెంటనే ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో రాత్రి 11.30 గంటల సమయంలో మృతి చెందింది. లక్ష్మి మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన కొత్తపల్లికి తరలించేందుకు.. కొమ్మిక నుండి చింతవానిపాలెం వాటర్ ఫాల్స్ జంక్షన్ వరకు ఒక ప్రైవేట్ వాహనంలో తీసుకొని వెళ్లారు. అక్కడి నుండి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి సుమారు 5 కిలోమీటర్లు మేర కాలినడకన మోసుకొని కొత్తపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. కొత్తపల్లి గ్రామానికి రహదారి లేకపోవడంతో అనారోగ్యానికి గురయ్యేవారిని, గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని, డోలీమోతతో తీసుకెళ్తున్నామని కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రినాథ్, సుందరరావు, శ్రీను, సత్తిబాబు, బోడిరాజు, సింహాచలం, కొండబాబు, సంతోష్, సిద్దేష్ తెలిపారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. మరణించిన ఆశా కార్యకర్త లక్ష్మికి భర్త సన్యాసిరావు, ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.










