ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 17వ జిల్లా మహాసభను ఆగస్టు నాలుగో తేదీన శ్రీకాకుళం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం తెలిపారు. కూలీలు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య భవన్‌లో సోమవారం నిర్వహించిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. 1934లో పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి, వ్యవసాయ కార్మికుల హక్కులను ఉద్యమంగా తీర్చిదిద్దారని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కూలీలు, కర్షకులు, వ్యసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటాలు సాగిస్తూ దేశవ్యాప్తంగా సంఘం విస్తరించిందని వివరించారు. మూడేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా భూ సమస్యలు, ఉపాధి హామీ, వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు, రైతాంగానికి నష్టం చేసే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన పోరాటాల్లో సంఘం భాగస్వామ్యమైందన్నారు. మహాసభల్లో గత పోరాటాలను సమీక్షించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిచుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘ జిల్లా నాయకులు కొల్లి ఎల్లయ్య, గంగరాపు ఈశ్వరమ్మ, డి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.










