May 03,2023 00:00

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షన, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 4న చింతూరులో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం ప్రచార బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని లోదొడ్డి గ్రామంలో ప్రారంభమైన ఈ బైక్‌ ర్యాలీ కొమరాపురం, జడ్డంగి మీదుగా రాజవొమ్మంగి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, మండల నాయకులు కొండ్ల సూరిబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే విద్య, ఒకే మతం అంటూ ప్రజలపై మనువాదం భావజాలాన్ని బలవంతంగా రుద్దుతుందని తెలిపారు. కట్టుకునే బట్ట, తినేతిండిపైనా ఆంక్షలు విధిస్తుందన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారావ్యవహారాలను దెబ్బతీసే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. అమాయక ఆదివాసీలను హృదయాల్లో విషాన్ని నింపుతుందన్నారు. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను అంబాని, అదాని వంటి కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంటుందని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 4న జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్నాథం, రామరాజు, రాజు, రమేష్‌, మురళి, సత్యనారాయణ, సింహాద్రి, శీను, శేఖర్‌, రాంబాబు, పాపారావు, విజరు, రమణ, ప్రవీణ్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.
చింతూరు : మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ప్రచార భేరి ముగింపు సందర్భంగా ఈ నెల 4న చింతూరులో జరుగు భారీ బహిరంగ సభకు వేలాది తరలిరాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఏడుగురాళ్ళపల్లిలో జరిగిన సిపిఎం జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని, దేశ సంపదను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. బీజేపీ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, మండల కార్యదర్శి సీసం సురేష్‌, నాయకులు పల్లపు వెంకట్‌, యర్రంశెట్టి, శ్రీనివాసరావు, మల్లం సుబ్బమ్మ, మడివి దీపక్‌, మడివి కొసయ్య పాల్గొన్నారు.