
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలో అర్ల నుండి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జజులబంద కొందశికర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాలుగు కిలో మీటర్లు డోలి యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ నీలబంద గ్రామం నుంచి ప్రారంభమైన పిత్రుగెడ్డ, పెద్దగరువు గ్రామాలు మీదుగా జాజులబంద గ్రామం వరకు సాగింది. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, ఎస్టీ కొందు తెగ 300 మంది కొండపై జీవిస్తున్నామని, గత 2020 సంవత్సరంలో ఇంటికి రూ.10వేల చొప్పున చందాలు వేసుకొని రూ.7లక్షలతో రోడ్డు నిర్మాణం చేసుకున్నామన్నారు. ఆ రోడ్డు వర్షాల కారణంగా కొట్టుకు పోయిందన్నారు. అనారోగ్యం వచ్చినా డోలి మోతలు తప్పడం లేదన్నారు. ఇటీవల కుంబర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా అడవి మార్గంలోనే చనిపోయిందన్నారు. తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.