
ప్రజాశక్తి-నక్కపల్లి :హెటిరో పైప్ లైన్ అనుమతులు రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. హెటిరో మందుల కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 492వ రోజుకు చేరింది. ఆదివారం శిబిరం వద్ద మత్స్యకారులు పైప్ లైన్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు .పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా తామంతా 492 రోజుల నుండి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, ఇవేమీ పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైప్ లైన్ కు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. వేట తప్ప మరో వృత్తి తమకు తెలియదని, సముద్రం పై ఆధారపడి తామంతా జీవనం సాగిస్తున్నామని తెలిపారు. సముద్రాన్ని కలుషితం చేసి తమ పొట్ట కొట్టొద్దన్నారు. తమ జీవన విధానం దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైనుకు ఇచ్చిన అనుమతులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు గోసల స్వామి, వాసపల్లి స్వామి, మైలపల్లి బాబుజి, బొంది నూకరాజు, పిక్కి తాతాజీ, గోసల అంజి , పిక్కి రామ్ చరణ్, చొడిపల్లి రాజు, కారే రాజు, కారే కోదండరావు, పిక్కి కోటి, మైలపల్లి శివ, మైలపల్లి జాను, కోడా కాశీరావు, కారే సతీష్, బోగడ తాతాజీ తదితరులు పాల్గొన్నారు.