Aug 20,2023 23:39

ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ సంచాలకులు సిహెచ్‌.సువార్త

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు పలు పథకాలు అమలు చేస్తున్నట్టు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ సంచాలకులు సిహెచ్‌.సువార్త తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 10 మంది వికలాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. 75 శాతం వైకల్యం ఉండి, 45 ఏళ్లలోపు వయస్సు కలిగినవారికి వాహనాలను అందిస్తున్నామన్నారు. వీటి కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్న ఆమె ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు.
వికలాంగులకు కేటాయించిన ఉద్యోగాల భర్తీ చేస్తున్నారా?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాం. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వం అనుమతించిన 49 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇటీవల మెరిట్‌ జాబితా విడుదల చేశాం. అభ్యర్థుల వైకల్యం నిర్ధారణపై తాజాగా ధ్రువీకరణ జరగాల్సి ఉంది. త్వరలో వీరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలకు జిల్లా కలెక్టరు పోస్టింగ్స్‌ ఇస్తారు.
ఏమేమి ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ శాఖ ద్వారా వికలాంగులకు రూ.3.16 లక్షల విలువైన ఉపకరణాలు జిల్లా కలెక్టర్‌ పంపిణీ చేశారు. మూడు చక్రాల మోటారు వాహనాలు, ల్యాప్‌ టాప్‌లు, టచ్‌ఫోన్లు, దృశ్య శ్రవణ యంత్రాలు, వీల్‌ చైర్లు లబ్ధిదారులకు పోలీసు పేరేడ్‌ గ్రౌండ్స్‌లో పంపిణీ చేశాం. వీరితో పాటు జిల్లాలో 75 మందికి మూడు చక్రాల సైకిల్స్‌, వీల్‌ చైర్స్‌, లాప్‌ ట్యాప్స్‌, టచ్‌ఫోన్లు, చేతికర్రలు, హియరింగ్‌ మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అర్హులైన వారు మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వేచేసి జిల్లాలో 709 మంది వికలాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు అంగీకరించింది.
వికలాంగులకు అందిస్తున్న రుణాలు?
నేషనల్‌ హ్యాండిక్యాప్‌డ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎఫ్‌ డిసి) ద్వారా కనీసం రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలు రుణం నేరుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో ఇద్దరికి, పల్నాడు జిల్లాలో ఏడుగురికి ఇచ్చాం. ఇందుకు సంబంధించి తగిన ప్రాజెక్టు రిపోర్టులతో దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా పదేళ్ల సర్వీసు ఉన్న ప్రభుత్వ అధికారి ఒకరు దరఖాస్తు దారులకు ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. స్వయంగా వ్యాపారాలు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదువుకునే వారికి వసతిగృహాలు?
గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లో 40 మంది బాలురకు ఉచితంగా వసతి గృహం నిర్వహిస్తున్నాం. నర్సరావుపేటలో అంథ విద్యార్థులకు ప్రత్యేకంగా వసతి గృహం ఉంది. ఇక్కడ 40 మంది అంథ విద్యార్థులు ఉన్నారు. నకరికల్లు మండలం చల్లగుండ్ల వసతి గృహంలో శారీరక వికలాంగులు దాదాపు 60 మంది వరకు ఉన్నారు.
వృద్ధులకు అందిస్తున్న సేవలు?
పురుషులకు 60 ఏళ్లు, మహిళలకు 58 ఏళ్లుదాటిన వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నాం. తద్వారా వీరికి ప్రభుత్వ పరంగా అందే కొన్ని ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. ఆర్‌టిసి, రైల్వేలో టిక్కెట్లు రాయితీలు, బ్యాంకుల్లో అధిక వడ్డీ, దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం పొందేందుకు అవకాశం ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం 2007 కింద కుమారులు, కోడళ్లు పట్టించుకోకపోతే చర్యలకు కూడా ఈ కార్డులు ఉపయోగపడతాయి.
ట్రాన్స్‌ జెండర్లకు అందిస్తున్న సదుపాయాలు?
ట్రాన్స్‌జెండర్లుకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వీరికి డిఆర్‌డిఎ ద్వారా సామాజిక పింఛన్లు ఇస్తున్నారు. నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా వివిధ చేతి వృత్తుల్లో శిక్షణిప్పిస్తున్నాం.