
ప్రజాశక్తి - ఎఎన్‌యు : బోధన , పరిశోధన, క్రీడా, సాంస్కృతిక, మౌలిక సదుపాయాలు కల్పన వంటి విషయాల్లో అంచలంచెలుగా ఎదుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్సిటీగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 1976లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీజీ సెంటర్‌గా ఏర్పడిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తొలుత 10 కోర్సులతో ప్రారంభమై నేడు సుమారు 70 కోర్సులను అందిస్తోంది. గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఏర్పడి గ్లోబల్ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
నూతన కోర్సులు
అనేక ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు ఆరు కళాశాలలుగా రూపాంతరం చెందింది. ఆర్ట్స్, కామర్స్, న్యాయ శాస్త్ర కోర్సులకు, సైన్స్ కోర్సులకు, వ్యాయామ విద్య కోర్సులకు, ఫార్మసీ విద్యకు, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌కు వేర్వేరు కళాశాలలు ఏర్పాటు చేసింది. అనేక నూతన కోర్సులు ప్రవేశపెట్టడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ ఫారెస్ట్రీ, ఎంఏ మ్యూజిక్, ఎమ్మెస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కంట్రోల్, ఎంటెక్ ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మల్టీమీడియా అండ్ యానిమేషన్, టీవీ అండ్ ఫిల్మ్, థియేటర్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వంటి కోర్సులను ప్రారంభించింది.
పెరుగుతున్న పరిశోధనలు
వర్సిటీలో పరిశోధకుల సంఖ్య కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. పరిశోధనలో ముఖ్యంగా పేటెంట్ హక్కులు సాధించడంలో జాతీయస్థాయిలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీల తరువాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్సిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఇంజినీరింగ్ కళాశాలలో శాటిలైట్ రీసెర్చ్ ప్రాజెక్టు, ఇస్రో ప్రాజెక్టులు చేశారు. 3డి ల్యాబ్, ఇంక్విబేషన్ సెంటర్, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ సెంటర్, ఏర్పాటు విద్యార్థులకు నూతన స్కిల్స్‌ను పెంపొందించడానికి దోహదపడుతున్నాయి.
ర్యాంకుల్లోనూ ముందజ
నాలుగేళ్లుగా సాధిస్తున్న ర్యాంకులు వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నాయి. దాదాపు 160 వరకు జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇండియా టుడే, ఎన్ ఐ ఆర్ ఎఫ్, గ్రీన్ మెట్రిక్ ర్యాంక్, ఇంపాక్ట్ ర్యాంకింగ్, వరల్డ్ ర్యాంకింగ్, క్యూ ఎస్‌ఐ గేజ్, ఈ లీడ్ ర్యాంకింగ్, గ్రీన్ యూనివర్సిటీ అవార్డులను పొంది రాష్ట్రంలో మొదటి రెండు స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహించిన మెగా జాబు మేళాలో 15 వేల మంది వరకు ఉద్యోగాలు సాధించారు. వర్సిటీ ప్రత్యేకంగానూ జాబ్‌మేళా నిర్వహించింది.
అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను ఆకర్షించడం
వర్సిటీలోని అంతర్జాతీయ విద్యార్థి కేంద్రంలో విదేశీ విద్యార్థులను ఆహ్వానించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నం, మయన్మార్, భూటాన్, నేపాల్, ఇరాన్ వంటి పలు దేశాల విద్యార్థులను ఆహ్వానించి వారి కోసం ప్రత్యేక వసతి గృహాన్నీ ఏర్పాటు చేశారు.
రెండేళ్ల వేడుకలు నేడు
వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని సోమవారం 46వ, 47వ వసంతాల వ్యవస్థాపక దినోత్సవాలను నిర్వహించేందుకు వర్సిటీ ముస్తాబైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు డైక్‌మన్ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఇందుకుగాను ఏడాదికి 11 మంది చొప్పున రేండేళ్లకు సంబంధించి 22 మందిని ఎంపిక చేశారు. విసి ప్రొఫెసర్ పి.రాజశేఖర్ అధ్యక్షతన జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నారు. మాజీ వీసీ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.
ప్రతిభా పురస్కార గ్రహీతలు వీరే
డాక్టర్ జయప్రద రామమూర్తి (శాస్త్రీయ సంగీతం), డాక్టర్ ఎం.గిరిజ శంకర్ (ప్రజాసేవ), గద్దె మంగయ్య (విద్యా మరియు దాతత్వ రంగం), దాసరి రామకృష్ణ (సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం), డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్‌రెడ్డి (వైద్య- సేవ రంగం), కిరణ్ మాకినేని (వైద్య -సేవా రంగం), నడింపల్లి హనుమంతరావు (కళా రంగం), మాస్టార్జీ (సామాజిక కళా సేవా రంగం), డాక్టర్ కోయి కోటేశ్వరరావు (సాహిత్య రంగం), అసిరయ్య (జానపద కళా రంగం), డాక్టర్ సిస్టర్ రోసలీన (సేవారంగం).
గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం : వీసీ
వర్సిటీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోందని వీసీ పి.రాజశేఖర్ అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోధన, పరిశోధనతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ, క్రీడా రంగాల్లో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే అధ్యాపకులకు ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల చొప్పున సీడ్మని అందించి నూతన ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా రీడింగ్ రూములు, లైబ్రరీ సదుపాయం, నిత్యం ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, యూజీసీ, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణణిస్తున్నామని తెలిపారు.