ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 46, 47 వార్డుల పరిధిలోని కప్పరాడ స్వీపర్ కాలనీ, కైలాసపురం, కస్తూరినగర్, శాంతినగర్ తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా 46వ వార్డులో ప్రధానంగా 24 ఞ 7 తాగునీరు అందించాలని, శిూతీలమైన కాలువలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, కస్తూరినగర్ నుంచి జాతీయ రహదారి వరకు ప్రధాన గెడ్డను ఆధునికీకరించాలని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న పోర్టు క్వార్టర్లలో నిఘా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, తాటిచెట్లపాలెం నుంచి కైలాసపురం వరకు రోడ్లు ఫుట్ పాత్‌లు, కాలువలు నిర్మించాలని కమిషనర్‌ను డిప్యూటీ మేయర్ కట్టమూర్తి సతీష్ కోరారు. కమిషనర్ స్పందిస్తూ తాటిచెట్లపాలెం నుంచి కైలాసపురం వరకు రోడ్లు, కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులు అంచలంచెలుగా చేపడతామని కమిషనర్ తెలిపారు.
47 వార్డులో కప్పరాడ కొండవాలు ప్రాంతం కావడంతో కాలువలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని నిర్మించాలని, తాగునీటి సమస్య తీర్చాలని, 275 సచివాలయం సిబ్బంది సరిగా విధులకు రావడం లేదని, స్వీపర్ కాలనీలో పారిశుధ్య కార్మికులు రావడంలేదని, వీధిలైట్లు సరిగా వెలగడం లేదని, రోడ్లను ఆక్రమించి ఉన్న బడ్డీలను తొలగించాలని, 36-96-55 గల ఇంటిలోకి కాలువ నీరు వస్తోందని, వెంటనే పరిష్కరించాలని కమిషనర్‌ను కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి కోరారు. కమిషనర్ స్పందిస్తూ రహదారులు, ఫుట్ పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, జోనల్ కమిషనర్ ఆర్‌జివి.కృష్ణ, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, కార్యనిర్వాహిక ఇంజినీర్ శ్రీనివాసు, ఎఎంఒహెచ్ డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










