ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహాధర్నా శనివారం నాటికి 415వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ మత్స్యకార జేఏసీ జిల్లా అధ్యక్షులు పిక్కి స్వామి మాట్లాడుతూ, కంపెనీ వ్యర్ధ జలాలు సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి పోతుందన్నారు. దీంతో, మత్స్యకారులు ఉపాధి కోల్పోయారని, కంపెనీ కాలుష్యం కారణంగా అనేకమంది మత్స్యకారులు రోగాల బారిన పడ్డారని తెలిపారు. పైప్ లైన్‌కు వ్యతిరేకంగా 415 రోజుల నుండి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం దారుణమన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార జేఏసీ విద్యార్థి ప్రధాన కార్యదర్శి వాసపల్లి నూకరాజు, మత్స్యకారులు కారే రాజు, కె.జగ్గా పాల్గొన్నారు.










