ప్రజాశక్తి-పాడేరు:పాడేరు ఘాట్లో ఆదివారం ఉదయం జరిగిన వాహన ప్రమాదంతో భారీగా రవాణా చేస్తున్న గంజాయి గుట్టు రట్టయింది. దీని వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు సుమారు 400 కిలోల గంజాయి వేసుకొని వెళుతున్న మహీంద్రా ఎక్స్ యువి వాహనం ఆదివారం ఉదయం పాడేరు మండలంలోని మినుములూరుకు సమీపంలో ఉన్న పోతురాజు గుడి వద్ద ఒక మలుపులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీని బలంగా ఢ కొట్టింది. ఈ ప్రమాదంతో గంజాయి తరలిస్తున్న వాహనం ముందు బాగమంతా గట్టిగా దెబ్బతిని మొరాయించింది. ఈ వాహనం కదలక పోయే సరికి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు వాహనాన్ని అక్కడే విడిచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా బస్తాలతో ఉన్న గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాహనంలో ఉన్న గంజాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాడేరు పోలీస్ ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపారు. ఈ వాహనంలో ఇంకా వేరువేరు రాష్ట్రాల పేరుతో ఉన్న వాహనం నెంబర్ ప్లేట్లను పోలీసులు కనుగొన్నారు. మన్యం నుంచి భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.










