ప్రజాశక్తి-రావికమతం:మండలంలో గుడ్డిప గ్రామంలో ని ఇండియన్ ఫుడ్ ఎక్స్ పోర్టు కంపెనీలో 400 కేజీల జీడిపప్పు శుక్రవారం రాత్రి చోరీకి గురైంది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజర్ అజరు కుమార్ రాదామని రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేనేజరు అజరు కుమార్ రాదామని మాట్లాడుతూ, గుడ్డిప, తట్టబంద వెళ్లే రోడ్డు పక్కన 2017లో ఇండియన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీని పెట్టామన్నారు. అప్పటి నుంచి నేటి వరకు 170 మంది మహిళలు 10 మంది పురుషులు దినసరి వేతనంతో పని చేస్తున్నారన్నారు. కంపెనీకి నైట్ వాచ్‌మెన్ లేనందున మేనేజరు, సిబ్బంది రాజేంద్ర, అఖిల్ మోహన్, అజరు కుమార్‌లతో పాటు తాను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ కంపెనీ పరిధిలో రాత్రింబబళ్లు నివాసం ఉంటున్నా మన్నారు. శుక్రవారం ఎప్పటి లాగానే సాయంత్రం 6 గంటలకు కంపెనీకి తాళాలు వేసుకుని దినసరి కూలీలు వెళ్లి పోయామన్నారు. తాను నలుగురు సిబ్బంది రూములకు తాళాలు వేసుకొని తమ తమ గదుల్లో పడుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం యధావిధిగా తెలుపులు తెరవగా జీడిపప్పు ట్రేలు ఖాళీగా ఉండటంతో ఒకసారిగా అవాక్కయ్యామన్నారు. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ వెతకగా కిటికీ ఐరన్ గ్రిల్స్ కత్తిరించి సుమారు 20 ట్రెలలో గల 400 కేజీల జీడిపప్పు దొంగలించినట్లు గుర్తించామన్నారు. రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేయగా సర్పంచ్ గుమ్మాల గణేష్‌రావు, కంపెనీ సిబ్బంది సమక్షంలో తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.










