May 09,2023 01:10
ఇంటిని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలో పట్టణ నడిబొడ్డున 40 ఏళ్ల నుంచి కోర్టు వివాదంలో ఉన్న ఇంటికి ఎట్టకేలకు మోక్షం లభించింది. చీరాల సివిల్‌ కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో వేటపాలెం పోలీసుల ప్రొటక్షన్లో ఇంటిని స్వాధీనం చేసుకుని వారసులకు అప్పగించారు. వివరాల ప్రకారం.. వేటపాలెం పట్టణం నడిబొడ్డున 45 ఏళ్ల క్రితం ఓ ఇంటిలో అద్దెకు దిగారు. కాలక్రమంలో ఆ ఇల్లు తనదంటూ కోర్టులో కేసు వేశారు. సొంతదారులు చేసేది ఏమీ లేక వారు కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టుకెక్కిన వాళ్లు కాలక్రమంలో గతించారు. అయితే వారి వారసులు మాత్రం పోటాపోటీగా కోర్టుల చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు అర్హులైన వారికే ఆ ఇల్లు స్వాధీనం చేసే విధంగా కోర్టు తీర్పు ఇవ్వటంతో పోలీసుల ప్రొటక్షన్‌ మధ్య కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల పంచనామాలతో ఇంటిని స్వాధీనం చేసుకుని వారసులకు అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.