Jun 03,2023 23:37

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న గోపీనాథ్‌రెడ్డి, జబర్దస్త్‌ ఫేమ్‌ రష్మీ

ప్రజాశక్తి -పిఎం పాలెం : మహిళా టి20 క్రికెట్‌ మ్యాచ్‌లు ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నార్తు జోస్‌ అకాడమీ మైదానం విజయనగరంలో నిర్వహిస్తున్నారు. మహిళా క్రికెట్‌ టోర్నీ టి20కు సంబంధించి పిఎం.పాలెంలోని ఎసిఎ- విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం ఆంధ్రా క్రికెట్‌ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా జబర్దస్త్‌ ఫేం రష్మీ పాల్గొన్నారు. అనంతరం ఎసిఎ సెక్రటరీ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మహిళ టి20 సీజన్‌ 1 గతంలో నిర్వహించామని, ఈ సీజన్‌లో కూడా ఐపిఎల్‌ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. గత ఏడాది మహిళా టి20 నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందన్నారు. 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఈ టి20లో నాలుగు జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సిఇఒ శివారెడ్డి పాల్గొన్నారు.