Nov 02,2023 22:19

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లాలోని 1569 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4, 5 తేదీల్లో బూత్‌ లెవల్‌ అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. కావున ప్రతీ ఓటరు ఈ ఏడాది అక్టోబర్‌ 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకుని తమ ఓటు ఉన్నది లేనిది సరి చూసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఎటువంటి సవరణలు అవసరమైతే సంబంధిత ఫారంలో బూత్‌ లెవిల్‌ అధికారుల వద్ద ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2024 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండినా లేదా నిండుతున్నట్లు అయితే వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అటువంటి వారు ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోకపోతే 4, 5 తేదీల్లో కొత్త ఓటు నమోదుకు ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ : 1950ను సంప్రదించవచ్చునని తెలిపారు. ఓటు అనేది రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అని, ఆ హక్కును 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు తప్పినిసరిగా వినియోగంచుకోవాలన్నారు.