Nov 02,2023 21:24

జిల్లా ఎన్నికల అధికారి కె.నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటూ ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్తగా ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బిఎల్‌ఒలకు నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబరు 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన లేదా నిండుతున్న వారు ఈ ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా కొత్తగా ఓటరు నమోదుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. వీరు ఫారం-6లో తమ దరఖాస్తును సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. భారతీయ పాస్‌పోర్టు కలిగి విదేశాలలో వుంటున్న భారతీయులు ఓటరుగా నమోదుకోసం 6ఏ ఫారంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు.
ఓటరు జాబితాలో ప్రస్తుతం వున్న పేరును తొలగించడానికి లేదా జాబితాలో పేరు చేర్చడానికి వ్యతిరేకంగా అభ్యంతరం తెలిపేందుకు ఫారం-7లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలోని పేర్ల మార్పులు, దిద్దుబాట్లు, అదే శాసనసభా నియోజకవర్గంలో చిరునామా మార్పు, ఒక శాసనసభ నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి పేరు మార్పు, ఓటరు ఫోటోగుర్తింపు కార్డు మార్పు, పి.డబ్ల్యు.డి. గుర్తింపుకోసం ఫారం-8లో దరఖాస్తు చేయాల్సి వుంటుందన్నారు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా వ్యవహరించే తహశీల్దార్‌ కార్యాలయాల్లోనూ, బొబ్బిలి, విజయనగరం మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో, బిఎల్‌ఒ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకొనే అవకాశం
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించదలచిన వారు నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ షషష.అఙరజూ.ఱఅ లో లాగిన్‌ అయి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా కూడా ఆన్‌ లైన్‌ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం, సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 1950కు డయల్‌ చేయవచ్చన్నారు. లేదా తమకు సమీపంలోని ఓటర్ల నమోదు అధికారి, సహాయ ఓటర్ల నమోదు అధికారి(తహశీల్దార్‌), జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సందర్శించి తగు సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.