ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఈనెల 4, 5 తేదీలలో చింతపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక మెగా సదరం శిబిరం నిర్వహిస్తున్నామని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు. సదరం క్యాంపు నిర్వహణపై జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు, చింతపల్లి ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులతో ఐటిడిఎ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం కెజిహెచ్, ఇతర ముఖ్యమైన ఆసుపత్రుల నుండి వైద్య నిపుణులు సదరం శిబిరంలో పాల్గొంటారన్నారు. కంటి వైద్య నిపుణులు, ఎముకుల వైద్యనిపుణులు, మానసిక వైద్య నిపుణులు, ఇఎన్ టి వైద్యనిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు తదితర 27 మంది వైద్యులు పాల్గొని సేవలందిస్తారన్నారు. వైద్యులు వికలాంగుల అంగవైకల్యంను సక్రమంగా పరీక్షించి సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తారన్నారు. జి.మాడుగుల, చింతపల్లి, జికె.వీధి, కొయ్యూరు మండలాలకు చెందిన దివ్యాంగులందరూ సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్దికి ఐటిడిఎ నుండి అన్ని విదాల సహకారం అందిస్తామన్నారు. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలకు అవసరమై మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చింతపల్లిలో శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి వైద్యాధికారులు చొరవ చూపించాలన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సేవలందించాలన్నారు. మాతా శిశు మరణాలు జరగకూడదన్నారు. ఈ సమవేశంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ శంకర ప్రసాద్, శస్త్ర చికిత్సల వైద్య నిపుణులు రవికిరణ్, చింతపల్లి ఆసుపత్రి సీనియర్ స్త్రీల వైద్యురాలు సుధా శారద, కీర్తి, కిల్లో రమేష్, తదితరులు పాల్గొన్నారు.










