Feb 01,2023 22:20

ఏలూరులో మూడో పిల్లల సంబరాలకు విస్తృత ఏర్పాట్లు
ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు

ఈ నెల 4, 5 తేదీల్లో ఏలూరులో హేలాపురి బాలోత్సవం పేరిట మూడో పిల్లల సంబరాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి, బాలోత్సవం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు షేక్‌ సాబ్జీ చెప్పారు. స్థానిక పవర్‌పేటలోని అన్నే భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరులోని సర్‌ సిఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో ఈ నెల నాలుగో తేదీ ఉదయం 9.30 గంటలకు హేలాపురి బాలోత్సవం మూడో పిల్లల సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. బాలోత్సవం ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బాలోత్సవం జయప్రదానికి వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కృషి చేస్తున్నామని వివరించారు. ఏలూరు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రముఖులు, పెద్దలు, వర్తక వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు అందరూ సహకరించాలని కోరారు. రేపటి పౌరులను దేశభక్తులుగా, సామాజిక దృక్పథం కలిగినవారిగా, పర్యావరణ ప్రేమికులుగా, సేవాతత్పరులుగా మార్చేందుకు విజ్ఞానవంతమైన సమాజాన్ని నిరించేందుకు ఈ బాలోత్సవ కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. బాలోత్సవ పిల్లల సంబరాల్లో ఏలూరు నగరంతోపాటు ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, ముసునూరు మండలాల్లోని 570 స్కూళ్లకు సంబంధించిన మూడో తరగతి నుండి పదో తరగతి వరకూ చదువుతున్న వేలాది మంది విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 60 రకాల కల్చరల్‌, అకడమిక్‌ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారని వివరించారు. ఏలూరు నగరంలో పెద్దఎత్తున జరుగుతున్న బాలోత్సవం మూడో పిల్లల సంబరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎల్‌.వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవంలో భాగంగా పాడుదమా స్వేచ్ఛా గీతం పాటను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో నమోదు చేసేందుకు వెయ్యి మంది విద్యార్థులతో ఆలపించేలా నాలుగో తేదీన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రెండు రోజులపాటు జరిగే ఈ బాలోత్సవం పిల్లల సంబరాల్లో విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్‌, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. బాలోత్సవం విజయవంతం చేసేందుకు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ విద్యార్థులను ప్రోత్సహించి వివిధ పోటీల్లో వారు పాల్గొనేటట్లు చేసి సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాలోత్సవం పిల్లల సంబరాల పోస్టర్లను ఆహ్వాన సంఘం కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం నాయకులు కె.శ్రీనివాస్‌, వై.ఆనందనాయుడు, ముస్తాఫ్‌ఆలీ, వి.సురేష్‌, ఎం.అజరుబాబు, కె.సత్యనారాయణ, ఎబి.త్రిపురసుందరి, కట్టా సత్యనారాయణ, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.