Jul 27,2022 23:21

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, పీస్‌రేటు తదితర కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆగస్టు 3న విజయవాడలో కరెంటు కార్మికుల జెఎసి ఆధ్వర్యాన నిర్వహించే రాష్ట్ర సదస్సుకు విశాఖ జిల్లా నుంచి విద్యుత్‌ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఎపిఇపిడిసిఎల్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె.శివారెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంట్రాక్టు, పీస్‌ రేటు కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, కాబట్టి వీరిని విద్యుత్‌ సంస్థలో విలీనం చేస్తామని ప్రకటించారని తెలిపారు. మూడేళ్లు గడిచినా సమస్యలు పరిష్కరించకపోగా విద్యుత్‌ కార్మికులపై రోజు రోజుకు పనిభారం పెంచుతూ ఉద్యోగ భద్రతలేకుండా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌, పీసురేటు కార్మికులందరినీ తక్షణమే విద్యుత్‌ సంస్థలో విలీనం చేయాలని, సమానపనికి సమానవేతనం చెల్లించాలని పిస్‌ రేటు విధానం రద్దుచేసి నెలవారీ జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 3న విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సులో కరెంట్‌ కార్మికుల జెఎసిగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎల్‌.రామకృష్ణ, పోలారావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.