
నెల్లిమర్ల: ఈ నెల 3న కోట వద్ద నిర్వహించనున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర రావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎపి బెవరేజస్ వద్ద ప్రజారక్షణ యాత్రపై కార్మికులతో సమావేశం నిర్వహించి గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ బస్సు యాత్రను ఈ నెల 2న మందసలో సిపిఎం అఖిల భారత నాయకులు ప్రారంభిస్తారని అక్కడి నుంచి విజయనగరం వస్తుందని చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం అధ్వర్యంలో మూడు బస్సు యాత్రలు ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాయన్నారు. దీనికి ముందు ఈ నెల 3న విజయనగరం కోటవద్ధ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి నగరం నలుమూలల నుంచి అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణ, శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా రక్షణ భేరి
బొబ్బిలి : దేశంలో లౌకికవాదాన్ని కాపాడి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా రక్షణ భేరి నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శి ఎస్.గోపాలం తెలిపారు. ఈ నెల 15న జరిగే చలో విజయవాడను జయప్రదం చేయాలని బుధవారం సిఐటియు కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.నాగభూషణ్ పాల్గొన్నారు.