Aug 01,2023 21:55

సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అవినాష్‌

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : మణిపూర్‌ ఆదివాసీలపై కార్పొరేట్‌, మతోన్మాదశక్తుల పైశాచిక మరణహౌమాన్ని ఆపాలని కోరుతూ ఈనెల 3న మన్యం బంద్‌కు ప్రజలంతా సహకరించి జయప్రదం చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ అన్నారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మణిపూర్‌ ఆదివాసీలపై కార్పొరేట్‌, మతోన్మాద శక్తుల పైశాచిక మారణహౌమాన్ని ఆపాలని, మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని, ఎపి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలన్నారు. జిఒ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాలను ఐదో షెడ్యూల్డ్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మండంగి లక్ష్మణరావు, చీదరపు అప్పారావు, సీతారాం, మోహన్‌ రావు, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.
కురుపాం : మణిపూర్‌ లో ఆదివాసీల పై జరుగుతున్న దమన కాండకు నిరసనగా ఆదివాసీ సంఘాలు పిలుపు మేరకు ఆగస్ట్‌ 3 న జరుగు రాష్ట్ర మన్యం బంద్‌ కు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసల హక్కులు పరిరక్షణ వేదిక అధ్యక్షులు కె.లక్షణమూర్తి తెలిపారు. నాలుగు నెలలుగా ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం అండతో జాతులు, మతాల మధ్య చిచ్ఛు పెట్టి, అభివృద్ధి చెందిన కుల, మతాలకు ఎస్‌టి హోదా కల్పిస్తూ కల్పిస్తూ నిర్ణయం చేయడం అక్కడ ఆదివాసీలుగా ఉన్న కుకీ, నాగాలు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిజేయడం, దాన్నీ సహించ లేని బీజేపీ ముసుగులో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు పాశవికంగా దాడులు చేసి హత్యలు చేయడం మహిళలను నగంగా ఊరేగించడం దారుణమన్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గూర్చి విదేశాల్లో ఉపన్యాసాలు చేసే ప్రధాని పార్లమెంట్‌లో విపక్షాలు డిమాండ్‌ చేస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. నైతిక విలువలున్న మణిపూర్‌ ముఖ్యమంత్రి ఐతే బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని, వీటన్నికి నిరసనగా జరుగు మన్యం బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు.