
ప్రజాశక్తి-గుంటూరు : ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 లో భాగంగా ఆదివారం నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3978 మంది యువతతో మెగా సేల్ఫీ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాయని, గుంటూరు నగరాన్ని కూడా స్వచ్ఛ, ఆరోగ్య నగరంగా మార్చుకోవడంలో నగర ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, పాలకవర్గం విశేష కృషి చేస్తుందన్నారు. నగరపాలక సంస్థ తీసుకున్న చర్యల వలన ఇటీవల జాతీయ స్థాయిలో నగరానికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో 3వ ర్యాంక్‌తో గుర్తింపు లభించిందన్నారు. ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0లో చేపట్టిన జిఎంసి మెగా సెల్ఫీకి నగరంలోని యువత నుండి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చతపై నగర ప్రజల్లో అవగాహన పెంచేందకు చేపట్టిన ఇండియన్ స్వచ్చత లీగ్ 2.0లో 3978 మంది యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా దేశంలో ఎక్కడా లేని సెల్ఫీ రికార్డ్ నమోదు అయ్యిందన్నారు. గతంలో చత్తీస్‌ఘడ్ నిట్‌లో 2200 మంది విద్యార్ధులదే ఇప్పటి వరకు రికార్డ్ అని అన్నారు. అదే విధంగా గత రెండు రోజులుగా నగరంలోని విద్యా సంస్థల్లో నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్‌లో 13 వేల మంది రిజిస్టర్ చేసుకోవటం ద్వారా అత్యధిక రిజిస్ట్రేషన్ చేయించిన నగరంగా గుంటూరు నిలిచిందన్నారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, వ్యర్ధాలను రోడ్ల మీద, కాల్వల్లో వేయకుండా పారిశుధ్య కార్మికులకే ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే గిరిధర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా నగరాలూ స్వచ్ఛ, ఆరోగ్య నగరాలుగా మారుతున్నాయన్నారు. అనంతరం మేయర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, షేక్ సజిల, అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎస్‌ఇ భాస్కర్, సిటీప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్‌ఒ డాక్టర్ భానుప్రకాష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, జిఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.