లక్ష రూపాయల విరాళం ఇచ్చిన జనసేన నాయకులు
ప్రజాశక్తి - రాంబిల్లి
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేవల్ బేస్ నిర్వాసితులు మండలంలోని వాడనర్సాపురం ఎన్‌ఎఒబి మెయిన్ గేట్ వద్ద చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 38వ రోజుకు చేరింది. ఈ ధర్నా శిబిరాన్ని జనసేన ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి సుందరపు విజరు కుమార్ అన్నయ్య, జనసేన పార్టీ నాయకులు సుందరపు సతీష్ కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఉద్యమం నిమిత్తం లక్ష రూపాయలను నేవీ నిర్వాసిత జెఎసి నాయకులు సతీష్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల ఉద్యమానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి నిర్వాసితుల సమస్యలను తన తమ్ముడు విజరుకుమార్ తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పప్పల నూకన్నదొర, కోరుకొండ ప్రసాద్, చోడిపల్లి అప్పారావు, మెరుగు ప్రవీణ్ కుమార్, కారి నూకరాజు, 8 గ్రామాల పెద్దలు, నిర్వాసితులు పాల్గొన్నారు.










