Aug 04,2023 22:02

నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న ఆర్‌జెడి చిన్మయదేవి

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : విశాఖ జోన్‌ పరిధిలో 376 అంగన్వాడీ భవనాల మరమ్మతుల కోసం నాడు-నేడు నిధులు మంజూరైనట్లు ఐసిడిఎస్‌ ఆర్‌జెడి చిన్మయిదేవి తెలిపారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ జోన్‌ పరిధిలో 68 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిలో అంగన్వాడీ భవనాలు 13,819 ఉన్నాయని తెలిపారు. 57,321 మంది గర్భిణులు, 63,964 మంది బాలింతలకు పౌష్టికాహార కిట్లను అందిస్తున్నామని చెప్పారు. ఏడు నెలల నుండి మూడేళ్ల పిల్లలు 1,71569 మంది అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నారని తెలిపారు. 395 మంది పిల్లలు చిల్డ్రన్స్‌హోంలో ఉంటున్నట్లు వెల్లడించారు. వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లు 4 వరకు పనిచేస్తున్నాయన్నారు. వివిధ నగరాల నుంచి చిన్న చిన్న తప్పులు చేసిన చిన్నారులు తమ ఆధీనంలో నడుస్తున్న వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో 99 మంది వరకు ఉన్నారని తెలిపారు. నాలుగు స్వధార్‌హోంలలో సుమారు 35 మంది వరకు యువతులు వివిధ రకాల పనులు చేస్తున్నట్లు చెప్పారు.
3 శిశుగృహాలలో తల్లిదండ్రులు లేని చిన్నారులను 241 మంది వరకు ఉంచి వాళ్లకు వివిధ రకాల వత్తులు నేర్పిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం జోన్‌ పరిధిలో భాల్య వివాహాలు చేసుకున్న చిన్నారులు సుమారు 26 మంది వరకు ఉన్నారని చెప్పారు. కోవిడ్‌తో మృతిచెందిన తల్లిదండ్రులు లేని సుమారు 61 మంది చిన్నారులు శిశు గృహాల్లో ఉంచినట్లు చెప్పారు. గృహహింస చట్టం కింద నమోదు చేసిన 1474 మంది యువతులకు కౌన్సిలింగ్‌ చేశామన్నారు. 572 మంది డొమెస్టిక్‌ వైలెన్స్‌ కేసులు విశాఖపట్నం జోన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఇరిడి, గుమ్మ గ్రామాలలో చేపడుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఎల్విన్‌పేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీడీ కె.విజయగౌరి, భద్రగిరి సిడిపిఒ సిహెచ్‌ సుశీలదేవి, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.