పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు, అంగన్వాడీ నాయకుల పిలుపు
రాయచోటి టౌన్ : ఐసిడిఎస్‌ను పరిరక్షించాలని, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాడ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10, 11న నిర్వహించే 36 గంటల ధర్నా జయప్రదం చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, డి.భాగ్యలక్ష్మి, జిల్లా కోశాధికారి పి.బంగారుపాప, జిల్లా ఉపాధ్యక్షులు పిఖాజాబి, జిల్లా కార్యదర్శి ఎస్.ఓబులమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పిలుపు నిచ్చారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ధర్నాలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 10న అంగన్‌వాడీల కోర్కిల దినోత్సవమని తెలిపారు. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. బిజెపి 9 సంవత్సరాల పాలనలో అంగన్‌వాడిల సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడం, నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలివ్వాలని, ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన అంగన్వాడీల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. పై సమస్యల పరిష్కారానికి జరిగే 36 దీక్షను జయప్రదం చేయాలని కోరారు. మరిన్ని డిమాండ్స్‌తో నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ధర్నాకు అంగన్వాడీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై.వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.36 గంటల ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు










