పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు, అంగన్వాడీ నాయకుల పలుపు
కడప అర్బన్ : ఐసిడిఎస్‌ను పరిరక్షించాలని, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాడ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10,11న నిర్వహించే 36 గంటల ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి పిలుపు నిచ్చారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ధర్నాలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 10న అంగన్‌వాడీల కోర్కిల దినోత్సవమని తెలిపారు. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. బిజెపి 9 సంవత్సరాల పాలనలో అంగన్‌వాడిల సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడం, నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని తెలిపారు. మరిన్ని డిమాండ్స్‌తో నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి అంజలీదేవి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, నాయకులు రాజేశ్వరి, పవన్ పాల్గొన్నారు.










