ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: విజయ డెయిరీలో పనిచేసిన 140 మంది కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా కార్మిక సంఘం నాయకులు విజయ కుమార్ మాట్లాడుతూ విజయ సహకార డెయిరీలో పనిచేసిన 140 మంది కార్మికులు వీఆర్‌ఎస్ తీసుకోకుండా నేటి వరకు వేతనాల కోసం పోరాటం సాగిస్తున్నట్లు తెలిపారు. విజయ సహకార డెయిరీని అమూల్ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం తమ వేతన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని కోరారు. కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించేంతవరకు తమ రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామన్నారు. 34 రోజులుగా కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు.










