Dec 17,2022 23:49

మల్కాపురంలోని శారద వర్థంతి సభలో మాట్లాడుతున్న జగ్గునాయుడు


ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విశాఖ జిల్లా శ్రామిక మహిళ ఉద్యమ నిర్మాత డి.శారద వర్థంతి కార్యక్రమం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు బి.పద్మ అధ్యక్షత వహించారు. ముందుగా శారద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యవక్తగా విచ్చేసిన డాక్టర్‌ కె.పద్మ మాట్లాడుతూ ఇంటా బయటా నిర్ణయాధికారాలలో మహిళల స్థానం మారకుండా సమాజాభివృద్ధి జరగదని చరిత్ర చెబుతోందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకునే మన దేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు దశాబ్దాలుగా తెర మరుగున పడిందన్నారు. జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్‌ కల్పించాలని మహిళా సంఘాలు సుదీర్ఘకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయన్నారు. 1996లో లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రభస జరిగిందన్నారు. వామపక్షాలు మినహా రిజర్వేషన్‌ బిల్లుపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడున్నర సంవత్సరాలలో మహిళా బిల్లు ప్రస్తావనే లేదని ఆవేదన వెలిబుచ్చారు. మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలలో అన్ని రాజకీయ పార్టీలూ వాగ్దానం చేస్తున్నాయన్నారు. ఓట్ల కోసం, రాజకీయ సభల కోసం మహిళలను ఉపయోగించుకుం టున్నారన్నారు. పార్టీలో పదవులు, ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంలో మొండి చేసి చూపిస్తున్నారన్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు 12 ఏళ్లుగా పార్లమెంట్‌ గోడలకు వేలాడుతోందని ఎద్దేవా చేశారు. మహిళలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఓటు హక్కు సాధించుకున్నారన్నారు. భారత్‌లో మహిళా సాధికారత కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. ప్రస్తుత లోక్‌సభలో 14.94 శాతం, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 8.2 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక మహిళ గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలైతే పెక్కు స్థానాల్లో మహిళలు గెలుపు పొందుతారన్నారు. నిర్ణయాధికారాల్లో సమాన భాగస్వామ్యం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎం.కామేశ్వరి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, డి.శారద మహిళా ఉచిత న్యాయ సలహా కేంద్రం కన్వీనర్‌ కె.అనురాధ, సిపిఎం మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె.మణి, కుమారి, రంగమ్మ, పుష్ప, భారతి, వి.ప్రభావతి, సిఐటియు నాయకులు బి.జగన్‌, వి.కృష్ణారావు, టి.నూకరాజు, జి.పోలేశ్వరరావు, జివిఎన్‌.చలపతి పాల్గొన్నారు.
ములగాడ : మల్కాపురం సిఐటియు కార్యాలయంలో శారద వర్థంతి సభ నిర్వహించారు. శారద చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారద విశాఖ డెయిరీలో ఉద్యోగం చేస్తూ శ్రామిక మహిళల సమస్యలపై పనిచేశారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై శ్రామిక మహిళలు పడుతున్న ఇబ్బందులు, ప్రజాసమస్యలపై పోరాటంలో ఆమె ముందున్నారని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్‌ అధ్యక్ష కార్యదర్శులు కె.పెంటారావు, ఆర్‌.లక్ష్మణమూర్తి, సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, ఎంఆర్‌కె. జనార్దన్‌, కార్మికులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక సిఐటియు కార్యాలయంలో శారద చిత్రపటానికి సిఐటియు నాయకులు ఎం.రాంబాబు, ఎన్‌.రాజేంద్రప్రసాద్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. శారద ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లోకేశ్వరరావు, ఐద్వా నాయకులు సంతోషం పాల్గొన్నారు.