ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో తీర ప్రాంతాల్లో ఉన్న 33 బీచ్‌లను అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వానికి ప్రణాళికలు పంపాలని కమిటీ తీర్మానం చేసిందని కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశం హాల్‌లో జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సముద్రతీర ప్రాంత 6 మండలాల్లో 33 చోట్ల టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో టూరిజం శాఖ గుర్తించిన 33 బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా సర్టిఫికెట్‌ను ప్రభుత్వం ఇవ్వడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బీచ్‌ల వద్ద పర్యాటకులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, బెంచ్‌లు, ఫుడ్ కోర్ట్‌లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రాథమికంగా 5 బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికెట్ కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు, టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా టూరిజం అధికారి సురేష్, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా అటవీశాఖ అధికారి భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.










