ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10 వేలు కనీస వేతనం అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచాలని తదితర డిమాండ్లతో ఈనెల 31న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి తెలిపారు. ధర్నాకు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా పోస్టర్లను సంఘ అధ్యక్షులు ఎ.పద్మతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించకుండా పనిచేయించుకుంటోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా పథకానికి, వంట కార్మికులకు కావాల్సిన నిధులను కేటాయించకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నాయని చెప్పారు. కార్మికులకు కనీస వేతనాలతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.10వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల విలీనం వల్ల అనేక చోట్ల పాఠశాలలు మూతపడ్డాయని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. జిల్లాలో స్కూల్‌లో వంట చేస్తూ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మలిపెద్ది రమా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగనన్న గోరుముద్ద పేరుతో ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటమ్‌తో ప్రభుత్వం మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపిందన్నారు. పెరిగిన మెనూ ధరలకు అనుగుణంగా ధరలు చెల్లించడం లేదన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆదిలక్ష్మి, కళావతి, లకీëకుమారి తదితరులు పాల్గొన్నారు.










