Oct 21,2023 19:42

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసు రత్నం

31న ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర
- జయప్రదం చేయండి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

     అసమానతలు లేని అభివృద్ధి కోసం, సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళిక అమలు కోసం ఈ నెల 31న ఆత్మకూరు పట్టణంలో జరిగే ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.యేసురత్నం, సీనియర్‌ నాయకులు ఏ.రాజశేఖర్‌లు కోరారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్‌ ఏ.ధనుంజయ మీటింగ్‌ హాల్‌లో సిపిఎం డివిజన్‌ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం మండల కార్యదర్శి నరసింహ నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు సొంత అజెండాల చుట్టూ తిరుగుతున్నాయని, ప్రజా సమస్యల చుట్టూ మళ్ళించాలనే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, 339 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలకు అదనపు సిబ్బందిని నియమించి కరువు నుంచి కాపాడాలని సూచించారు. ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా లేదని, విష జ్వరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి జ్వరాలకు మూల కారణాలను గుర్తించి నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో దసరా పండగ సందర్భంలో రేషన్‌ కార్డుదారులకు బియ్యం, పప్పు, నూనె ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడం లేదని విమర్శించారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో దాడులు ఎక్కువయ్యాయని, ఈ దాడులను కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి, జనసేన రాజకీయ పార్టీలు ఖండించకపోగా కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రజలు, కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధికి ఎటువంటి విధానాలు కావాలనే అంశంపై చర్చించి సిపిఎం ఆధ్వర్యంలో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉండే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాప్రక్షమా లేక బిజెపి పక్షమో తేల్చుకోవాలన్నారు. ఈ నెల 31న ఉదయం 11:30 గంటలకు ఆత్మకూరు పట్టణంలో జరిగే ప్రజారక్షణ భేరి బస్సు యాత్రలో పట్టణ ప్రజలు, మేధావులు, లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్‌, పాములపాడు మండల కార్యదర్శి సామన్న, నాయకులు టి వెంకటేశ్వర రావు, శంకర్‌ రెడ్డి, సంజీవ రాయుడు, మాబాష, సుధాకర్‌, వీరన్న, సురేంద్ర, స్వాములు తదితరులు పాల్గొన్నారు.