ప్రజాశక్తి-అనంతగిరి
బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఈనెల 31వ తేదీన జరిగే మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు గిరిజన సంఘం కార్యాలయం వద్ద సోమవారం గిరిజన సంఘం, ఉపాధ్యాయ, మహిళ సంఘం, సిఐటియు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సిఐటియు మండల కార్యదర్శి కె.మొస్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, స్థానిక జెడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ, బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి చిచ్చు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గిరిజనులంతా ఏకమై పోరాటానికి సన్నద్ధం కావాలని, ఈనెల 31న మన్యం బందును విజయవంతానికి గిరిజనులు అంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు డి. సన్యాసిరావు, గురుదొరలు మాట్లాడుతూ, ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకులను చేర్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. గిరిజనులంతా ఏకమై మన హక్కులు, చట్టాలు కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అనంతగిరి సర్పంచ్ సోమెల. రూతు, గిరిజన సంఘం మండల నాయకులు ఎస్.నాగులు, జె. సుబ్బారావు, మహిళా సంఘం నాయకురాలు బి.కాసులమ్మ, డి దేవుడమ్మ, ఉప సర్పంచ్ అర్జున్, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు సిఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు.
అరకులోయరూరల్ : బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 31న రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం చేయాలని అరకువేలి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, రవ్వలగుడ, శరభగుడ, కంఠబంసుగుడ, సి.కాలని, యండపలివలస ప్రాంతంలో గిరిజన సంఘం నాయకులు విస్తతంగా ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగంలోని ఎస్టీ జాబితాలో రిజర్వేషన్లను కల్పించారన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం కుడా అసెంబ్లీలో తీర్మానం చేసిందని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లను తుంగలో తొక్కి కుట్ర పన్నుతుందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి గిరిజన ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారన్నారు. బంద్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు. వివిధ ప్రజా సంఘాల నేతలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తామల జోషి, గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న, అధ్యక్షులు గత్తుం బుజ్జిబాబు, కిండంగి రామారావు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ : బోయ,వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్పిస్తే సహించేది లేదని టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరి దొన్నుదొర హెచ్చరించారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 ను రద్దు చేసినా స్పందించని వైసిపి ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్పించడానికి తీర్మానించడం సరికాదన్నారు. దీనిపై గిరిజన ఎమ్మెల్యేలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిని నిరసిస్తూ ఈనెల 31న గిరిజన సంఘాలు, జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని, గిరిజనులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, జిల్లా నాయకుడు కే సుబ్బారావు, నాయకులు పాల్గొన్నారు.
రంపచోడవరం : బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 31న జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌కు జయప్రదం చేయాలని పలువురు వ్యక్తలు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కంగల శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏక సభ్య కమిషన్ నియమిస్తూ జిఓ నెంబర్ 52 జారీ చేసి బోయ వాల్మీకి బొంత ఒరియా తదితర బీసీ కులాలను ఎస్టీల్లో చేర్చాలన్న ఓటు బ్యాంకు రాజకీయాలను తిరస్కరించాలని, రిజర్వేషన్ల విధానాన్ని రద్దుకు పాలకులు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆటో, రవాణ రంగాలలో బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లె రెడ్డి, విద్యాసాగర్, పలు సంఘాల నాయకులు వీక బుల్లి కొండలు దొర, కుంజం సత్య నారాయణమ్మ, వంజం జోగారావు, కుంజం సిద్దు, పోడియం పండుదొర, కత్తుల ఆదిరెడ్డి, మడకం ప్రసాద్, కోసు అచ్చిబాబు, కారం రామన్నదొర, పకీరుదొర, వరలక్ష్మి, వంతు బాలకృష్ణ, తోడం వెంకటేష్, కంగల అబ్బాయి దొర పాల్గొన్నారు.
చింతూరు : బోయ వాల్మీకి బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపాలని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించాలని గిరిజన సంఘం జిల్లా నాయకురాలు మల్లం సుబ్బమ్మ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఏడుగురాళ్లపల్లి కేంద్రంa వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సోలం కన్నయ్య దేసయ్య, సవలం వెంకయ్య సవలం విజయ. కనితి సమ్మయ్య, పోడియం రాధా సవలం రాదా, పార్వతి, సవలం పుష్ప పాల్గొన్నారు.
బంద్‌కు సిపిఎం మద్దతు
ప్రజాశక్తి-విఆర్.పురం
బిసిలుగా ఉన్న బోయ వాలీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 31న జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు చెప్పారు. మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్టీలకు ఉన్న చాలా రకాల రిజర్వేషన్లు తీసివేశారు, జీవో నెంబర్ 3ను రద్దు చేశారని తెలిపారు. ఇటువంటి తరుణంలో బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో కలపడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి ఆదివాసీల మీద ప్రేమ ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోదన్నారు. దీనిపై ఆదివాసీ ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరాటం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు.
మన్యం బంద్‌ను విజయవంతం చేయండి
సీలేరు : బోయ వాల్మీకి , బొంతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 31న జరగనున్న రాష్ట్ర బందును విజయవంతం చేయాలని గాలికొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య, రవాణా, హోటల్ యజమానులు, గిరిజనులు బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు మురళి చంటి బాబు, రామారావు లాకే రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు.










