ప్రజాశక్తి -పాడేరు : ఈనెల 31న గిరిజన ప్రజాసంఘాల పిలుపునిచ్చిన రాష్ట్ర ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజరు కోరారు. మంగళవారం లోతుగడ్డ జంక్షన్ సంత కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం బంద్‌పై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 24న బోయ/వాల్మీకులు బెంతులను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ వైసిపి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, కేంద్రానికి నివేదించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరననగా చేపట్టే మన్యంబంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఏజెన్సీ బంద్‌కు అన్ని వ్యాపార వర్గాలు సహకరించాలని, గిరిజన నిరుద్యోగ యువత, మేధావులు, విద్యావంతులు, మహిళలు అందరూ పాల్గొని బందును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, కిల్లో సింహాచలం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాంగి జీవన్‌కృష్ణ, సిహెచ్ ప్రేమ్ కుమార్, మామిడి ప్రసాద్ పాల్గొన్నారు.
పాడేరు : బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ 31న గిరిజన సంఘం రాష్ట్ర మన్యం బంద్ పోస్టర్‌ను గుర్రగరువు గ్రామంలో జిల్లా నాయకులు ఎల్ సుందరరావు ఆవిష్కరించారు. మండల నేతలు సూరిబాబు, బాలరాజు, సంజీవ్ తదితులున్నారు.
గిరిజన ప్రజాప్రతినిధుల వైఖరి స్పష్టం చేయాలి
అరకులోయ రూరల్: బోయ/ వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ వైసిపి ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష జెఎసి జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. మంగళవారం అరకువేలి గిరిజన భవనంలో ఆదివాసీ జెఎసి మండల కన్వీనర్ ఎల్.మహాదేవ్, కో కన్వీనర్ కిల్లో ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటే, ఎస్‌టి రిజర్వేషన్‌తో గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానంపై ఎస్‌టి కమిషన్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ కుంభారవిబాబు, అరకు ఎంపీ మాధవి మౌనంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గిరిజనులై ఉండి, తోటి గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే, దానికి ప్రశ్నించి నిలదీయకుంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.మన్యం బంద్ నేపథ్యంలో 31న పర్యాటకులెవరూ ఏజెన్సీలోని పర్యాటక కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జెఎసి సలహాదారులు సోనాయి గంగరాజు, జనసేన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి, వంపూరు గంగులయ్య, హుకుంపేట జెడ్‌పిటిసి రేగం మత్యలింగం, పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, పెదలబుడు ఎంపిటిసిలు ఎల్బీ భీమరాజు, శత్రుఘ్న, దురియా ఆనంద్, వైస్ ఎంపిపి కిల్లో రామన్న, డిఎల్‌ఒ నాయకులు నన్ని జానుబాబు, పాడి చందు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విఆర్.పురం :బోయ వాల్మీకి, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈ 31న జరగనున్న రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని పలువురు ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రేఖపల్లి క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం దారుణమన్నారు. ఈ విషయంపై ఆదివాసీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, పోరాటంలోకి కలిసి రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. ఆదివాసీ నాయకులు పాయం లక్ష్మణ రావు, వేటకాని మల్లయ్య, పోడియం రాజు, పూనెం ప్రదీప్ కుమార్, చిక్కాల రామారావు, గొంది చంద్రయ్య, పండ వెంకన్న బాబు, సారా పాండు, భేతి రాజు, కల్ల సత్యనారా యణ, పండ వెంకటేష్, పండ రాజశేఖర్ పాల్గొన్నారు.
చింతూరు. : బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వైసిపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆదివాసీ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై దాడి తీవ్రతరం చేశాయని, 1/70, పీసా చట్టాలు అమలు కావడం లేదని, జిఒ 3ను రద్దుపై మాట్లాడటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు కోసం సుబ్బారావు, సీసం సురేష్, చిన్నంరెడ్డి, సోడి నారాయణ, వేకా రాజ్ కుమార్, పండ కష్ణయ్య, బొగ్గ ముత్తయ్య, కె.బ్రహ్మయ్య, సోడే అశోక్, సీతారామయ్య పాల్గొన్నారు.
ఎటపాక : బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనులంతా ఐక్యమై పోరాడాలని, మార్చి 31న జరిగే మన్యం బంద్ విజయవంతం చేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాక అర్జున్ దొర పిలుపునిచ్చారు. మంగళవారం మద్దులగూడెం గ్రామంలో బుద్దుల భద్రయ్య అధ్యక్షతన ఏపీ గిరిజన సంఘం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులంతా ఏకపక్షంగా వైసిపికి ఓటు వేశారని, కృతజ్ఞత చూపించాల్సిన ప్రభుత్వం ఆదివాసీలపై కక్ష కట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నక్కా సూరిబాబు, సవలం రాము, పూనెం వెంకట్రావు, పర్షిక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










