- ఎమ్‌డిఎం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేలు వేతనం చెల్లించడంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మోనూ ఛార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 31న కలెక్టరేట్ వద్ద కార్మికులు చేపడుతున్న ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం కె.సుశీల అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తరతో కలిసి మాట్లాడారు. 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించకుండా పని చేయించుకుంటోందన్నారు. మధ్యాహ్న భోజనానికి తగిన నిధులు కేటాయించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వీరికి కనీస వేతనాలు గాని, పిఎఫ్, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. పాఠశాలలో వంట చేస్తూ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మలిపెద్ది రమా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. కార్మికులకు యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించ వద్దన్నారు. వంటపాత్రలు, గ్యాస్టవ్, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఎ.రాధ, టి.సీతమ్మ, వి.లక్ష్మి, ఎం.రామలక్ష్మి, కె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.










