ప్రజాశక్తి -నక్కపల్లి :మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 31న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మిడ్ డే మిల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి పిలుపునిచ్చారు. మిడ్డేమిల్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నక్కపల్లి నూకాలమ్మతల్లి గుడి వద్ద శనివారం నిర్వహించిన సమావేశంలో వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై పనిభారంతో పాటు, వేదింపులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విలీనం పేరుతో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేతనాలు పెంచడంతో పాటు పని భద్రత కల్పించాలని, వంటకు ఉపయోగించే వంట పాత్రలు సరఫరా చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. హైస్కూల్‌లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు కేటాయించి, 10 నెలలకు కాకుండా 12 వేతనాలు ఇవ్వాలని కోరారు.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు లోకలక్ష్మి, రత్నం, మణి, రమణమ్మ, మహాలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










