Oct 29,2022 00:02

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న విద్యార్థులు, జెవివి నాయకులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి జనవరి 8 వరకు విద్యార్థులకు చెకుముకి సైన్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా ప్రతినిధులు బి.రామ్‌ కుమార్‌, ఎం.వెంకట అప్పారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను విద్యార్థులతో కలిసి శుక్రవారం వారు అచ్యుతాపురంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 ఏళ్లగా ఉపాధ్యాయ సంఘాల సహకారంతో ఈ సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి అక్టోబర్‌ 31న, మండల స్థాయి పోటీలు నవంబర్‌ 10న, జిల్లాస్థాయి పోటీలు డిసెంబర్‌ 10, 11 తేదీల్లోనూ, రాష్ట్రస్థాయి పోటీలు 2023 జనవరి 7, 8 తేదీల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8, 9,10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతి నుంచి మొదటి స్థానం పొందిన ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి, ముగ్గురు విద్యార్థుల జట్టును పాఠశాల జట్టుగా పైస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటుందని, విద్యార్థి ఏ భాషలోనైనా రాయవచ్చని పేర్కొన్నారు.