Jan 17,2023 22:53

దీక్ష చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంతో 30వ రోజుకు చేరుకున్నాయి. గత 30 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నా అధికారుల్లో మాత్రం కనీస స్పందన కరువైంది. వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, మహిళా సంఘాల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి జవాబు దారి లేకుండా పోయింది. ఆశ్రమాల్లో విద్యార్థుల మరణాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల మరణాల పట్ల నిర్లక్ష్య వైఖరి ఆలంభిస్తున్న పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణను తక్షణమే సరెండర్‌ చేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల వరుసగా జరిగిన ఆరుగురు గిరిజన విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఆశ్రమాల్లో విద్యార్థులకు కాస్మోటిక్స్‌ పంపిణీ పునరుద్ధరించాలని, ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్లలను నియమించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గిరిజన ఆశ్రమ విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై నెల రోజులుగా దీక్షలు చేపడుతున్నా అధికారులు, ప్రభత్వుం నుంచి స్పందన కాన రాకపోవడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.